వివేకా హత్య కేసులో కొన్నిఆధారాలు..

203
YS Vivekananda Reddy
- Advertisement -

వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టు పోస్టుమార్టంలో తేలడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కూతురు సునీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో వివేకాది హత్యే అని తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు.

SIT to investigate

వివేకానందరెడ్డిది హత్యగా ప్రాథమికంగా నిర్థారించినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు స్పష్టంచేశారు. నుదిటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక భాగంలో మరో గాయం, ఛాతి, తొడ భాగంలోనూ గాయాలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు.

ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు గుర్తించామని, అవి ఎవరివో తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ కేసు విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని రాహుల్ దేవ్ శర్మ స్పష్టం చేశారు.

- Advertisement -