రానున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ జరిగే తేదీలపై అతి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ వారం చివర్లో…లేదంటే వచ్చే 12 తేదీలోగా ప్రకటన వెలువడుతుంది. అని ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ఏర్పాట్లు కొలిక్కిరావడంతో ఎన్నికల తేదీల ప్రకటనకు రంగం సిద్ధమైందని పేర్కొన్నాయి. ఏప్రిల్- మే నెలల మధ్య 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మొదటి విడత ఎన్నికల కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ మధ్య వారంలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. కాగా, జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్న నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదలలో ఎటువంటి జాప్యం లేదని, ప్రధాని షెడ్యూలు ప్రకారం తాము పనిచేయబోమని, తమకంటూ ఓ షెడ్యూలు ఉందంటూ గతంలో వచ్చిన విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. జూన్ 3తో 16వ లోక్‌సభ గడువు ముగియనుందని, ఆలోపు ఫలితాలు రావాల్సి ఉంటుందని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాబట్టి షెడ్యూలు విడుదలలో ఎటువంటి జాప్యం జరగడం లేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి.