పారాచ్యూట్ సహాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన అభినందన్‌ను కాపాడింది అల్లరి మూకలు తీసిన వీడియోలేనని తెలిపారు మాజీ ఫైటర్ పైలట్ భార్గవ. అభినందన్‌ను కొట్టిన అల్లరి మూలకలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి పనే చేశారని అన్నారు. లేదంటే అభినందన్ పరిస్థితి వేరేలా ఉండేదని, ఆయన బతికి ఉన్నాడనేందుకు ఆధారాలు కూడా దొరికేవికావన్నారు.
ఇస్లామాబాద్ కూడా ఆయన అరెస్టు కాలేదనే చెప్పేదని ఆయన జీవితమంతా పాకిస్థాన్ జైలులోనే గడపాల్సివచ్చేదన్నారు. 1971 యుద్ధంలో అదృశ్యమైన 54 మంది సైనికుల మాదిరిగానే అభినందన్ కూడా కనిపించకుండా పోయేవారన్నారు.
1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జేఎల్ భార్గవ పాకిస్థాన్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉండి విడుదలయ్యారు. అప్పట్లో తన అరెస్టును నెల రోజుల తరవాత భారత్‌కు పాకిస్థాన్ చెప్పిందని గుర్తుచేశారు. ఒక పైలట్ పారాచ్యూట్ ద్వారా సరిహద్దులో పడినప్పుడు అతనికి ఎదురయ్యే తొలి ప్రమాదం అల్లరిమూకేనని, అభినందన్‌ను పాకిస్థాన్ ఆర్మీ కాపాడటం నిజంగా అదృష్టమని భార్గవ చెప్పారు.