సినీనటుడు కౌశల్ అంటే ఎవరికి తెలియక పోవచ్చు..కానీ కౌశల్ ఆర్మీ,బిగ్ బాస్ 2 విన్నర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో టక్కున్న గుర్తొస్తారు. బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ 2 విన్నర్‌గా గెలవడం వెనుక కౌశల్ ఆర్మీ కృషి మరువలేనిది. కౌశల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కౌశల్‌కి ఓటువేసేలా చేయడంలో వీరి పాత్ర అమోఘం. బిగ్ హౌస్ నుండి కౌశల్ బయటికి వచ్చిన తర్వాత కూడా పలు నగరాల్లో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆర్మీ తిరగబడింది.
బిగ్ బాస్‌లో ఉన్న కౌశల్ వేరు నిజజీవితంలో కౌశల్ వేరు అంటూ కౌశల్ ఆర్మి ఫౌండర్ సభ్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. కౌశల్‌కి డబ్బు పిచ్చి అని వేలాదిమంది కౌశల్ ఆర్మి పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఏ కార్యక్రమం నిర్వహించినా అన్ని ఖర్చులు కౌశల్ ఆర్మి సభ్యులుగా భరించి ఆర్థికంగా నష్టపోయామన్నారు. పేరుకే స్వచ్ఛంద సేవ అని కానీ ఆయన కోరికలు,ఆశలు మాత్రం ఫైవ్ స్టార్ రేంజ్ అని ఆరోపించారు. ఏ ఈవెంట్ జరిగినా ఫైవ్ స్టార్ హోటల్‌లో బస,ఫ్లైట్ ఛార్జీలతో సహా ర్యాలీల పేరుతో డబ్బులు ఖర్చుపెట్టామని కానీ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో వస్తున్న డబ్బులకు అకౌంటబులిటీ లేకుండా పోయిందన్నారు.
బిగ్‌బాస్ విన్నర్‌గా వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్‌లకు ఖర్చు చేస్తానని ప్రకటించినా ఇప్పటి వరకూ ఎలాంటి సేవాకార్యక్రమాలను చేపట్టలేదని వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే కొంతమంది పెయిడ్ ఆర్మీ ద్వారా రెచ్చిపోయి ట్రోల్స్ చేసేలా చేస్తాడని పేర్కొన్నారు. కౌశల్‌పై ఈగ వాలనివ్వని కౌశల్ ఆర్మీ యూటర్న్ తీసుకోవడం,సంచలన ఆరోపణలు చేయడంపై కౌశల్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.