ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇవాళ ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్ధాన్ లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో పిఒకె వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనలు దాడి చేశాయి. ఉదయం చేసిన దాడిలో దాదాపు వందల మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే పాకిస్థాన్ మాత్రం తమ వారు ఎవరూ చనిపోలేదంటూ తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నియంత్రణ రేఖను ఉల్లంఘించిన మాట నిజమే కానీ.. వాళ్ల దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని చెబుతుంది.
పాకిస్ధాన్ కు ఇదే సరైన సమాధానం అంటూ పలువురు సెలబ్రెటీలు కితాబిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వం చేసిన వైమానిక దాడిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ స్పందించారు. ఈ దాడితో పాక్ కు గట్టిగా బుద్ది చెప్పారని, వాళ్లకు తగిన శాస్త్రీ జరిగిందంటూ తెలిపారు. పుల్వామాలో దాడి జరిగిన వెంటనే రియాక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పాకిస్ధాన్ మళ్లీ దాడికి పాల్పడితే తిరిగా దాడి చేయడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పుల్వామా దాడి అనంతరం పాక్ మంత్రి ఒకరు ఇండియా లోని దేవాలయాల్లో గంటలు మోగకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఎంపీ ఓవైసీ. భారత దేశం గురించి ఆయనకు తెలియదు. ఈదేశానికి చెందిన ముస్లింలు బ్రతికున్నంత వరకూ గుడి గంటలు మోగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు అభినందిస్తున్నారు.