కేసీఆర్ మంత్రులకు మరో గట్టి షాక్ ఇవ్వబోతున్నారా..?? మొన్ననే మంత్రుల పీఎస్ లను తానే నియమిస్తానని చెప్పి కొత్త మంత్రులకు షాక్ ఇచ్చిన కేసీఆర్ ఈ సారి పీఆర్వోలను కూడా కట్ చేయబోతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతీ మంత్రి ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ను నియమించుకునే అధికారం ఉంటుంది. అతనికి జీతం సగటున 50 వేల నుంచి 60 వేల దాకా ఉంటుంది. ఆ పీఆర్వో సదరు మంత్రిత్వ శాఖలో జరిగే కార్యకలాపాలు. అభివృద్ధిపనులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం దగ్గర నుంచి సంబంధింత మంత్రి నియోజకవర్గం ప్రజలతో అనుసంధానం నెరుపుతుంటారు.
అలాగే మీడియాకు సదరు మంత్రిత్వ శాఖకు మధ్య సత్సంబంధాలు ఉండేలా చూడటం పీఆర్వో విధి.. అయితే ఈ పీఆర్వోలు తమ పదవిని దుర్వినియోగం చేస్తున్నట్లు కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.. ఈ పీఆర్వోల్లో చాలామంది అసలు విధులు మరిచి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సీఏంకు ఫిర్యాదులు అందాయట.. వారు భూ దందాలు..సెటిల్ మెంట్లు… కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం దగ్గర నుంచి మంత్రిని కలిసేవారి దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నట్లు సీఏం కి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ పీర్వోల వ్యవస్థను రద్దు చేయాలని సీఎం భావిస్తున్నారు. దీనికి బదులుగా ఒక సెంట్రల్ మీడియా సెల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచే అన్ని డిపార్ట్ మెంట్ల సమాచారాన్ని మీడియాకు చేరవేసే ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం..ఈ మీడియా సెంటర్ నిర్వహణను కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది..అయితే ఇలాంటి పనులు కొందరు పీఆర్వోలే చేస్తున్నారనీ..ఇలా అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని కొందరు భావిస్తున్నారు..ఏది ఏమైనా పీఆర్వోల వ్యవస్థకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.