హీరో కల్యాణ్ రామ్ తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘118’ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందంతా బాగానే ఉంది కానీ ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ పలుమార్లు సినిమా పేరును తప్పుగా చెప్పారు.దాంతో అక్కడికి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బాలయ్య తన ప్రసంగంలో సినిమా పేరును 189 అని పలుమార్లు తప్పుగా పేర్కొన్నారు. తెలుగులో గుహన్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం 189 అని పేర్కొనడంతో ఆహూతులు నివ్వెరపోయారు. కల్యాణ్ రామ్ వెనక నుంచి సినిమా పేరును సరిచేసే ప్రయత్నం చేసినా బాలకృష్ణ వినిపించుకోలేదు. తప్పును సవరించుకోకుండానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఇదివరకు చాలా సందర్భాల్లో బాలయ్య ఇలా తప్పులు పలుకుతూ..దోరికిపోయారు.
ఇక హీరో కల్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్ రామ్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడని బాలయ్య ప్రశంసించారు. కొత్త వాళ్లకు ఇవ్వడం కోసం ‘అతడొక్కడే’ సినిమాను నిర్మించాడని గుర్తు చేశారు. ఆ తపన కల్యాణ్ రామ్‌లో కనిపిస్తుందని కితాబిచ్చారు.
ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు ప్రొడక్షన్ బ్యానర్‌పై 118 సినిమాను నిర్మించిన మహేశ్ కోనేరుకి, దర్శకుడు గుహన్‌కు, సంగీత దర్శకుడు శేఖర్ చంద్రకు, హీరోయిన్లు నివేదా థామస్, శాలినీ పాండే, ఇతర కళాకారులకు బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా పేరు ప్రతిష్ఠలు తీసుకురావడంతోపాటు ఆర్థికంగానూ లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తన స్పీచ్‌ను ముగించారు. తొలిసారి కల్యాణ్రామ్ నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న విడుదల కాబోతోంది.