రాష్ట్ర అభివృద్దికి ఎన్ఆర్ఐలు సహకరించాలన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని ప్రారంభించారు ఎంపీ కవిత. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం పుట్టిన ఊరుకు ఎన్ఆర్ఐ లు ఎంతో కొంత సహాకారం అందిస్తే గ్రామాలు బాగుపడతాయన్నారు. మన ప్రాంతానికి, చదువుకున్న పాఠశాలకు, పుట్టిన ఊరుకు తమవంతుగా ఎంతో కొంత తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షుడు సంపత్ రావు ప్రతి ఏడాది తన స్వగ్రామానికి వీలైనంత సహాయం అందిస్తూ వస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
(హరీష్ రావుకు మరో పరీక్ష పెట్టనున్న సీఎం కేసీఆర్)వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://goo.gl/GfVpCj
పుస్తకాలు చదివే సంస్కృతి తగ్గిపోతున్న తరుణంలో మంచి పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన సంపత్ రావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కవిత చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ గ్రామ అభివృద్దికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు ఎంపీ కవిత. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ మిత్రులకు ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.