ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకునేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 4 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు.
ఎంఐఎం కూడా టీఆర్ఎస్ మద్దతుతో అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం 5 ఎమ్మెల్సీ స్ధానాల్లో పోటీలో ఉంటామని గెలిచి తీరుతామని ప్రకటించారు. దీంతో పొలిటికల్ వాతావరణం మరింత హీటెక్కింది.
నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిసి తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 120 మంది సభ్యులున్నారు. ఒక ఎమ్మెల్సీ సభ్యుడు గెలవడానికి 24 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 90,ఎంఐఎంకు 7,నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 98 సభ్యులున్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలుండగా సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా బీజేపీ ఓటింగ్‌కు దూరంకానుంది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్‌తో ఐదో స్థానాన్ని గెలుచుకునేలా కేసీఆర్ స్కెచ్ వేశారు. రెండో ప్రాధాన్యతా ఓట్లతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి 5 స్థానాలనూ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కు రెండో ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం లేదు. మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లు వేయడంలో తమ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్న టీఆర్ఎస్‌లో మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా చేయాలని భావిస్తోంది. మొత్తంగా కేసీఆర్ వేసిన స్కెచ్ పక్కాగా అమలైతే మండలిలో హస్తం పార్టీ నిల్ కావడం ఖాయం.