మలయాళంలో సూపర్ హిట్టయినా చిత్రం టూ కంట్రీస్‌ను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. సునీల్ కథానాయకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. న్నపూర్ణ స్టుడియోలో సోమవారం జరిగిన షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీయర్ దర్శకుడు దాసరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
సునీల్‌పై కేటీఆర్ క్లాప్ కొట్టగా.. దాసరి నారాయణరావు కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్ ‘నేను తేనెపట్టు లాంటోడిని.. పిండితే హనీ.. అమ్మితే మనీ’ అనే డైలాగ్ చెప్పి అలరించారు.
ఈ సంధర్బంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ‘‘సునీల్ స్వయంకృషితో ఎదిగిన నటుడు. ఆయన శైలికీ, మలయాళ నటుడు దిలీప్ హావభావాలకీ మధ్య దగ్గరి పోలికలుంటాయి. అందుకే మలయాళంలో దిలీప్ నటించిన ‘టూ కంట్రీస్’ చిత్రాన్ని సునీల్‌తో తీయాలని నిర్ణయించా. ప్రేక్షకుల్ని మెప్పించే ఓ మంచి కథ ఇది. రాం ప్రసాద్, కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రకాష్, గోపీసుందర్… ఇలా ఒక మంచి సాంకేతిక బృందం కుదిరింది. రచయిత శ్రీధర్ సీపాన వినోదంతో పాటు, భావోద్వేగాలతో కూడిన సంభాషణల్ని బాగా రాశారు. అమెరికా, ఇండియా దేశాల మధ్య ఈ కథ సాగుతుంది. 70 శాతం సినిమాని అమెరికాలో చిత్రీకరిస్తాం’’ అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇటీవల ప్రేక్షకులు వినోదాత్మక చిత్రాల్ని చూడటానికే ఇష్టపడుతున్నారు. అందరికీ మంచి ఫలితం లభించాల’’ని ఆకాంక్షించారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘శంకర్ తొమ్మిది సినిమాలు చేస్తే ఎనిమిది సినిమాలు విజయవంతమయ్యాయి. అయితే ఆ స్థాయిలో ఆయన కెరీర్‌కి వూపు రాలేదు. ఈ చిత్రం నుంచి శంకర్ బిజీ దర్శకుడిగా కొనసాగాలని కోరుకొంటున్నా. చలం, నగేష్, మహమూద్, కిషోర్ కుమార్‌లని గుర్తు చేస్తుంటాడు సునీల్. చిరంజీవిలా డ్యాన్సులు ఫైట్లు చేస్తుంటాడు. సునీల్, శంకర్ చేస్తున్న ఈ చిత్ర గొప్ప కథతో తెరకెక్కుతుండడం ఆనందంగా ఉంద’’న్నారు.
వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతుందని హీరో సునీల్ అన్నారు. అధ్బుతమైన కథ దొరికిందని.. టెక్నిషియన్లు కూడా కుదిరారని తెలిపారు.