తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 17న హైదరాబాద్ జలవిహార్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ బర్త్ డే ఏర్పాట్లకు సంబంధించి జరగుతున్న పనులను పరిశీలించిన ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతోనే భారీగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కేసీఆర్ పుట్టిన రోజున ఉదయం సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో గణపతి, ఆయుశ్, చండీహోమాలు జరపనున్నట్లు తెలిపారు. జలవిహార్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయని, తెలంగాణ పథకాలను వివరించే స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు.
పద్మారావునగర్ డివిజన్‌లో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన తలసాని ఈ వేడుకలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత, హరీశ్‌రావుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరవుతారని తలసాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఆర్‌ఎ్‌సఎల్‌పీ కార్యదర్శి రమేష్, మనం సైతం కాదంబరి కిరణ్, పార్టీ నాయకులు గుర్రం పవన్‌కుమార్, సామా ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.