ఓ వైపు మంత్రివర్గ విస్తరణ మరోవైపు ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్ధానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో తెలంగాణ పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఫిబ్రవరి 10న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వెలువడుతుండగా మార్చిలో ఖాళీ కాబోతున్న 16 ఎమ్మెల్సీ స్ధానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది.
ఇక మార్చి 28న ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయన మళ్లీ మండలి ఛైర్మన్‌గా కొనసాగిస్తారా లేదా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.ఒకవేళ స్వామిగౌడ్‌కి మళ్లీ అవకాశం ఇవ్వకపోతే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మండలి ఛైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రెడ్యా నాయక్ లేదా రేఖానాయక్ లో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1999,2008లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్,చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014లో వరంగల్ ఎంపీగా పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఒకరిగా పేరు
తెచ్చుకున్నారు.