ఈ లోకంలో మానవ జన్మ ఓ అద్భుత సృష్టి. ప్రపంచంలో ఏ మానవుడైనా తనకు మరో జన్మ అంటూ ఉంటే మానవ జన్మలోనే పుట్టాలని కోరుకుంటాడు. . ఈ భూప్రపంచంలో ప్రతి తల్లి తను తల్లి కావాలని కోరుకుంటుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డలకు జన్మనిస్తుంది. తన రక్తమాంసాలను ముద్దలుగా చేసి బిడ్డలను పెంచి పెద్దచేస్తుంది. బిడ్డల ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకుంటుంది. పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే చూసి మురిసిపోతుంటుంది. ఈ ప్రపంచంలో ఏ తల్లి పిల్లల మద్యనైనా ఇదే జరుగుతుంది. కానీ ముంబైకి చెందిన రాఫెల్ సామ్యూల్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే అతను మనిషి పుట్టుకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపైనే తిరుగుబాటు చేస్తున్నాడు.
ఏకంగా అతని అనుమతి లేకుండా అతని తల్లిదండ్రులు ఆయనకు జన్మనిచ్చారని నిరసిస్తూ అంతటితో ఊరుకోకుండా ఏకంగా తన తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలంటూ ఉద్యమిస్తున్నాడు. రాఫెల్ సామ్యూల్ తన నిరసనను సాదా సీదాగా కాకుండా గుబురు గడ్డం, మీసంతో ఉన్న ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేస్తూనే అతనికి తన తల్లిదండ్రులపై అభిమానం ఉందని, అయితే తాను ఈ భూమ్మీదకు వచ్చి ఎందుకు బాధపడాలని, తాను ఎందుకు పనిచేయాలని పేర్కొంటున్నాడు. సామ్యూల్ ఓ పక్క తన నిరసన తెలియజేస్తూనే తన నిరసన గురించి తన తల్లికి చెప్పాడు.
సామ్యూల్ నిరసనపై తన తల్లి కూడా స్పందించింది. సామ్యూల్ తల్లిదండ్రులు లాయర్లుగా పనిచేస్తున్నారు. తాము లాయర్లుగా పనిచేస్తున్నామని తెలిసి కూడా తమ కొడుకు తమను అరెస్టు చేయాలని అంటున్నాడంటే వాడి ధైర్యాన్ని మెచ్చుకోవాలని, నేను వాడి అనుమతి లేకుండా జన్మనివ్వడం తప్పని వాడికి అనిపిస్తే ఆ తప్పును ఒప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన తల్లి తెలిపిందని సామ్యూల్ తెలిపాడు. అయితే ఇప్పుడు సామ్యూల్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌తో పాటు వివాదంగా మారింది.