అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. తొలుత ఫిబ్రవరి 7 లేదా 8 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇవేవీ కాకుండా ఫిబ్రవరి 10న కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహుర్తం ఖరారు చేసినట్లు సన్నిహితవర్గాల టాక్. ఫిబ్రవరి 10 వసంత పంచమి కావడంతో ఆ తేదీనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ఫైనల్ చేశారని సమాచారం.
తొలివిడతలో కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఈ సారి కేబినెట్‌లో పాత,కొత్తవారికి స్ధానం కల్పించనున్నారట. సామాజిక వర్గాల వారీగా ఏడుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు టాక్.
ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌తో పాటు సీనియర్ నేత హరీష్‌కు రెండో విడత మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం తక్కువేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేబినెట్‌లో చోటు దక్కించుకునే వారిలో ప్రధానంగా ఈటల రాజేందర్,తలసాని శ్రీనివాస్‌తో పాటు పద్మా దేవేందర్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.
కేబినెట్ విస్తరణ తర్వాత డిప్యూటీ స్పీకర్,చీఫ్ విప్,విప్,పార్లమెంటరీ సెక్రటరీ పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్.ఫిబ్రవరి మూడోవారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో అంతకంటే ముందే కేబినెట్ విస్తరణ,అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన మాదిరిగానే ముందుగానే ఎంపీ అభ్యర్థుల ప్రకటన,మార్చిలో జరిగే 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అంశాలపై దృష్టిసారిస్తున్నారు కేసీఆర్. మొత్తంగా కేబినెట్ విస్తరణకు గడువుసమీపిస్తుండటంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.