కోట్లాది మంది భక్తుల కష్టాలు తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆధిపత్యం కోసం జీయర్లు, వైష్ణవ అర్చకులు పోటీపడి శ్రీవారి నామాన్ని వివాదం చేస్తున్నారు. దీంతో తిరుమలేశుడి ఆలయంలో మళ్లీ నామాల గొడవ మొదలైంది. గర్భగుడిలోని మూలవరుల నుదుట పచ్చ కర్పూరంతో దిద్దే నామం ఆకారాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మార్చేశారంటూ ఆలయ జియ్యర్ స్వామి టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సాధారణంగా.. శ్రీవారి నుదుట చతురస్రాకారంలో తెల్లటి పెద్ద నామం దిద్దుతారు. ప్రతి గురువారం నేత్ర దర్శనం సమయంలో ఈ నామాన్ని తొలగించి చిన్న నామం దిద్దుతారు. శుక్రవారం అభిషేకం తరువాత తి రిగి పచ్చకర్పూరంతో పెద్ద నామం అద్దుతారు. ఇది వారమంతా ఉంటుంది. ప్రతి నెలా తొలి శుక్రవారం రోజున ఈ బాధ్యతలను రమణదీక్షితులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం తర్వాత రమణదీక్షితులు మూలవరుల నుదుట నామం దిద్దారు. మా సాంప్రదాయ ప్రకారం నామాలు పెట్టాలని ఓ వర్గం అంటుంటే.. మా సాంప్రదాయం ప్రకారం నామాలు పెట్టాలని మరోవర్గం అంటోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోంది.
వైష్ణవంలో తెంగలై, వడగలై అనే పేర్లతో రెండు వర్గాలున్నాయి. తెన అంటే దక్షిణాది అని అర్థం. దక్షిణాది వారిని తెంగలై అని, ఉత్తరాదివారిని వడగలై అనీ అంటారు. తెంగలై వారు ఇంగ్లీషు అక్షరం ‘వై’ ఆకారంలో ఉండే నామాన్ని నుదుట ధరిస్తారు. వడగలై వారు ‘యు’ ఆకారంలో ఉండే నామం ధరిస్తారు. వైష్ణవాన్ని వ్యాప్తి చేసిన రామానుజాచార్యుల పరంపర అంతా తెంగలై నామం (వై) ధరిస్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వడగలై వర్గానికి చెందినవారు కాగా, జియ్యర్లు తెంగలై వర్గానికి ప్రతినిధులు. ఈ రెండు వర్గాల మధ్యా అనేక అంశాల్లో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కాగా బ్రిటిషర్ల కాలంలోనే ఈ వివాదం రచ్చకెక్కింది. యు, వై ఆకారాలకు మధ్యస్థంగా చతురస్రాకారంలో నామం ఉండేలా ఇరు పక్షాలను అప్పట్లో ఒప్పించారు. ఇప్పటి దాకా తిరుమల శ్రీవారి నుదుట చతురస్రాకారపు నామమే ఉంది. అయితే వడగలైకి చెందిన రమణ దీక్షితులు దీనిని వడగలై (యు) నామంగా మార్చేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారని వివాదం రేగుతూ ఉంది. ఏడేళ్ల కిందట కూడా ఆలయంలో ఇదే వివాదం రేగింది. తాజాగా శుక్రవారం మరోమారు నామాల గొడవ రచ్చకెక్కింది.
అయితే రమణ దీక్షితులు నామాలు పెట్టిన వ్యవహారాన్ని జియ్యంగార్లు ఆలయ డిప్యూటీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జియ్యంగార్లు డిప్యూటీ ఈవోతో వాగ్వాదానికి దిగారు. తోమాల సేవ విధులకు హాజరుకాబోమని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ విషయాన్ని డిప్యూటీ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంలో రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది. గతేడాది కూడా రమణ దీక్షితులు కుమారుడు అభిషేకం సమయంలో శ్రీవారి నామాలు మార్చడంపై జియ్యంగార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రమణ దీక్షితులు కుమారుడిని ఆరు నెలల పాటు అభిషేక సేవలకు దూరంగా ఉంచారు. అయితే ఇప్పుడు రమణ దీక్షితులే స్వయంగా అభిషేక సేవలు నిర్వహించడంతో టీటీడీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే 45 ఏళ్లుగా స్వామివారి కైంకర్యం నిర్వహిస్తున్న తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. ఇప్పుడే కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారంటు మండిపడ్డారు రమణదీక్షితులు. ఇప్పటికే తన మనవడిని శ్రీవారి గర్భాలయంలో తీసుకువెళ్లారని రమణ దీక్షితులు ఆలయ ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. ఆ వ్యవహారం సద్దుమణగకముందే మరో వివాదంలో ఇరుక్కున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.