మరోసారి తెరపైకి..గవర్నర్‌గా కృష్ణంరాజు..!

203
Krishnam Raju
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తున్నారనే వార్తలు రెండు రోజులగా వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ వస్తున్నారని ప్రచారం జరుగుతుండగానే మరో ఆసక్తికర పేరు తెరమీదకు వచ్చింది. కొంతకాలంగా ఏపీ గవర్నర్‌గా కృష్ణంరాజును నియమిస్తున్నారనే వార్తలు వెలువడుతుండగా ఆ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా కృష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు ఐబీ టైమ్స్‌ అనే ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

రెబల్ స్టార్ గా తెలుగు ప్రజల్లో ఆయనకున్న స్థానం, వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోందని కథనాన్ని ప్రచురించింది.అంతేగాదు ప్రభాస్ ఒప్పుకుంటే ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపింది.బీజేపీ నుంచి వచ్చే ఆఫర్ ను కృష్ణంరాజు అంగీకరించవచ్చని, ఇదే సమయంలో తన కెరీర్ లో స్టార్ హీరోగా ఎదిగి, ఉన్నత స్థానానికి చేరిన ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండి, కేవలం ప్రచారానికి పరిమితం కావచ్చని తెలుస్తోంది.

బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న రెబల్ స్టార్‌…వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కృష్ణంరాజు 1998 లో కాకినాడ నియోజకవర్గం నుండి 12 వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన కృష్ణంరాజు మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రింగా పనిచేశారు.

1970- 90 మధ్య కాలంలో మాస్ హీరో గా తెలుగు ఇండస్ట్రిని షేక్ చేశారు కృష్ణంరాజు. సినీ కెరీర్‌లో నాలుగు ఫిలింఫేర్ లతో పాటు రెండు నంది అవార్డులు అందుకున్న కృష్ణంరాజు తాజాగా రుద్రమదేవి చిత్రంలో గణపతి దేవుడుగా నటించారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవిది అదే ఊరు కావడం విశేషం. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ
నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత తన సొంతగూటికి బీజేపీలో చేరారు.

- Advertisement -