ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువులా మారింది. అయితే అలాంటి ఫోన్ చోరీ అయితే పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. ఫోన్ పోయిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు పోలీసులు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఫోన్ దొంగల ముఠాకు చెక్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల్లోనే దొరకపట్టి ఇస్తున్నారు.
ఇదంతా పోలీసులు తీసుకొని వచ్చిన ‘హాక్ ఐ’ మొబైల్ అప్లికేషన్ ద్వారా సాధ్యమవుతుందని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా బాధితులు…. హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పనులకు హ్యాట్సాఫ్ అంటూ హైదరాబాద్‌ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హాక్ ఐ మొబైల్ అప్లికేషన్లో వివిధ రకాలైన ఫీచర్లు ఉన్నాయి. అందులో సెకెండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసేవారు, సెల్‌ఫోన్ కొనేముందు హాక్ ఐ అప్లికేషన్లో ఐఎంఈఐ నెంబర్లను చూసుకోవచ్చు. దొంగతనం అయినా, మిస్సింగ్ అయిన సెల్ఫోన్లకు సంబంధించి ఐఎంఈఐ నంబర్లతో కూడిన డేటాబేస్ ఉంటుందని సీపీ వివరించారు.
‘హాక్ ఐ అప్లికేషన్’ ఉపయోగాలు..
దీంతో కొనబోతున్నది దొంగిలించిందా? కాదా? అనే విషయం నిర్ధారణ అవుతుందన్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ కోర్ టీం, హాక్‌ఐకి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా సెల్ఫోన్ల ఫిర్యాదులపై స్పందించిన ఐటీ విభాగం ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా 24 సెల్ఫోన్లను రికవరీ చేసిందన్నారు. సుమారు 9 లక్షల మంది సెల్ఫోన్లలో హాక్ ఐ అప్లికేషన్ ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని సీపీ సూచించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.