సాగునీటి రంగంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును సీఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రశంసించారు. నిన్నమొన్నటి వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడిన ఆయన..రైతులకు సాగు నీటిని అందించే విషయమై ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరదకాల్వ పంప్‌హౌస్ ట్రయల్ రన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన,,,ప్రభుత్వ పనితీరును కొనియాడారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఆయకట్టు ప్రాంత ప్రజలకు 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఇది సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. వచ్చే సీజన్ నాటికైనా ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జానారెడ్డి ఏఎమ్మార్పీ పర్యటనకు ముందు నల్లగొండ ఎంపి గుత్తా అక్కడికి చేరుకుని కెనాల్ పనులను పరిశీలించారు. పర్యటన అనంతరం గుత్తా తిరుగుపయానం అవుతుండగా,,,అదే సమయం లో జానారెడ్డి అక్కడకు చేరుకున్నాడు. దీంతో గుత్తా సుగేందర్ రెడ్డి,,జానారెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరదకాల్వ పంప్ హౌస్ ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించానని, సభా ప్రాంగణం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూసి సూచనలు చేసి వస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జానారెడ్డి వరద కాల్వ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. రైతుల ఆకాంక్ష మేరకు పంప్‌హౌస్‌ను పరిశీలించటానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు వరదకాల్వ పరిశీలన సమయంలో కూడా గుత్తా విలేకరులతో మాట్లాడారు. 1997లో మంజూరైన ఈ ప్రాజెక్టు పనులు 19 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుం దని కితాబిచ్చారు. అధికార టీఆర్ఎస్ నేత ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి,,విపక్ష నేత జానా రెడ్డి కలయిక చర్చనీయాంశమయ్యాయి.