ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అది మరువక ముందే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మరో నేత కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ , ఇండియా టీం మాజీ కెప్టెన్, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.
అజారుద్దీన్ అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన సన్నిహితులు మాత్రం ఖరారు చేస్తున్నారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలవడంతో తన రాజకీయ జీవితం కోసం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇటివలే జరిగిన ఓ ఎంపీ కూతురి వివాహంలో టీఆర్ఎస్ కీలక నేతలతో అజారుద్దీన్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.
అజారుద్దీన్ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్కు ఆ ఎంపీ విజ్ఞప్తి చేసినట్టు వార్తలొస్తున్నాయి. సంక్రాంతి తర్వాత అధికారికంగా ఆయన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అజారుద్దీన్ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు.