కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో దాదాపు 40రకాల వస్తవులపై పన్ను తగ్గించినట్టు తెలిపారు అరుణ్ జైట్లీ. 28 శాతం శ్లాబులోని 7 రకాల వస్తువులను, 18 శాతం శ్లాబులోని 33 రకాల వస్తువులను కింది శ్లాబ్స్ లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడు రకాల వస్తువులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని, 33 రకాల వస్తువులపై 18 శాతం నుంచి 12, 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రూ.100 లోపు సినిమా టికెట్లపై పన్ను 18 నుంచి 12 శాతానికి, రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న సినిమా టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. విమానం టికెట్ల విషయానికొస్తే ఎకానమీ క్లాసుపై 5 శాతం, బిజినెస్ క్లాసుపై 12 శాతం జీఎస్టీ ఉంటుంది. జన్ ధన్ ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు నివ్వగా, 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలు, వీడియో గేమ్స్ పై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్ణయించామని అన్నారు