రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శుభవార్తనందించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. త్వరలో పంచాయతీ కార్యదర్శుల కొలువులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందించిన సర్కార్ రాతపరీక్షలోని మార్కుల ఆధారంగా ఎంపికలు జరిగేలా కసరత్తు చేస్తోంది.
9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాలు… జిల్లాల వారీగా పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది సర్కార్. అక్టోబరు నెలలో నిర్వహించిన రాత పరీక్షలో లభించిన మార్కుల ఆధారంగా ఎంపికలను చేపడుతుంది.
ప్రస్తుతం విధులను నిర్వహిస్తున్న 3,396 మంది రెగ్యులర్ కార్యదర్శుల వేతనాలను ప్రభుత్వమే తన ఖజానా నుంచి చెల్లిస్తోంది. జూనియర్ కార్యదర్శులకూ ఇదే మాదిరిగా వేతనాలను అందజేస్తుంది.
పంచాయతీ వారీగా కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పేరుతో అప్పట్లో 6,603 పోస్టులను కొత్తగా సృష్టించడంతోపాటు, అప్పటికే ఖాళీగా ఉన్న మరో 2,752 ఉద్యోగాలను వీటికి కలిపింది. మొత్తం 9,355 పోస్టుల కోసం అక్టోబరు 10న జేఎన్‌టీయూ ద్వారా రాత పరీక్షను నిర్వహించగా.. 4.75 లక్షల మంది దీనికి హాజరయ్యారు.