అభివృద్ధిని చూసి ఓటేయాలని కామారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ కామారెడ్డిని జిల్లా చేసిన ఘనత టీఆర్ఎస్‌దే అన్నారు. గంప గోవర్దన్ గెలిస్తే జిల్లా చేస్తానని మాట ఇచ్చానని ఆ మాట
నెరవేర్చానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోవర్దన్ గెలిస్తే లక్షన్నర ఎకరాలకు సాగు నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. దశల వారీగా మిగితా హామీలను నెరవేరుస్తానని తెలిపారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ వస్తుందన్నారు.గంపను లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఎన్నికలు వస్తే జెండాలను చూసి ఆగం కావొద్దన్నారు. అమాయకంగా ఉంటే మోసం చేసి పోతారని చెప్పారు కేసీఆర్. ఏం చేస్తే లాభం జరుగుతుందో అనే కోణంలో ప్రజలు ఆలోచించాలన్నారు.టీడీపీ,కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎట్లా ఉండే టీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. విద్యుత్ మంత్రిగా షబ్బీర్ హయాంలో జరిగిన విద్యుత్ పోరాటాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్,టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు.
తలసరి విద్యుత్ సగటు వినియోగంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచామన్నారు. ఒకప్పుడు ఉన్న ఫించన్‌కు ఇప్పుడు ఉన్న ఫించన్‌కు తేడా గమనించాలన్నారు. కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు చేయూతనిచ్చామన్నారు.వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు వచ్చే ఏడాది నుండి ఫించన్‌ను పెంచబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మహార్దశ కల్పించామన్నారు. కేసీఆర్ కిట్‌తో ఆసరాను అందించామన్నారు. తప్పిపోయి కాంగ్రెస్ వస్తే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. కాళేశ్వరంతో కామారెడ్డికి నీళ్లు వస్తున్నాయని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అలాంటి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రపంచలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రంతో కొట్లాడుతున్నామని చెప్పారు. రైతు బంధు తర్వాత రైతుకు భీమాతో ధీమా కల్పించామన్నారు.పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు అన్నారు కేసీఆర్.