పార్లమెంట్ సభ్యులకు శుభవార్త. ఎంపీల వేతనాలు 100 శాతం పెంపుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతమున్న వేతనం రూ.50 వేలకు రెట్టింపు అయ్యి లక్ష రూపాయలకు చేరుకుంది. వేతనాలతో పాటు అలవెన్స్ లు కూడా భారీగానే పెరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడున్న వేతనాలు, అలవెన్స్ ప్రజా ప్రతినిధుల ఖర్చులకు, కార్యకాలాపాలకు సరిపోకపోవడంతో,,వేతనాలు పెంచే ప్రతిపాదనపై కొంతకాలంగా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎన్‌డీఎ ప్రభుత్వం జీతాలు, అలవెన్స్ పెంచేందుకు.. ఓకమిటీ ని నియమించింది.
మొదట ఎంపీల వేతన పెంపుకు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటుచేశారు. కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి క్రమంలో ఈ కమిషన్ ను మోదీ రద్దుచేశారు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షతన..వేతన, అలవెన్స్ ను జాయింట్ కమిటీ రూపొందించింది. కమిటీ సూచించిన ప్రతిపాదనలను మంత్రి మండలి సమీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎంవో ఆమోదంతో మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి.
అంతకముందు పార్లమెంట్ సభ్యుల అలవెన్స్ చూసుకుంటే, ప్రతినెలా వారికి ఇచ్చే నియోజకవర్గ భత్యం రూ.45,000 ల నుంచి రూ.90,000కు పెరిగింది.సెక్రటరీ సహాయం, కార్యాలయ భత్యం కింద నెలకు రూ. 90,000ను పార్లమెంట్ సభ్యులు అందుకోనున్నారు. పార్లమెంట్ సభ్యుల వేతనాలు,అలవెన్స్ పెంచడం వల్ల పారదర్శకంగా పనిచేస్తారనే సూచన మేరకు ఈ నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా రాష్ట్రపతి వేతనాన్ని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి వేతనంతో పాటు గవర్నర్ వేతనాన్ని కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచనున్నారు.రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో ఎంపీల వేతనాల పెంపు బిల్లుకు ఆమోదం లభించాక,,కార్యరూపం దాల్చనుంది.