ఖమ్మం జిల్లాలో ఉద్యమచైతన్యం ఎక్కువని చెప్పారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన పాలేరు,ఖమ్మం నియోజకవర్గాల భారీ బహిరంగసభనుద్దేశించి మాట్లాడిన సీఎం టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలిపారు. గొప్ప పోరాటలు చేసిన గడ్డ ఖమ్మం,అనేక మంది రాజకీయ నాయకులకు పుట్టినిల్లని తెలిపారు.గత
ఎన్నికల్లో ఒక్క ఖమ్మం తప్ప ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగి అధికారంలోకి వచ్చామన్నారు. ఈసారి ఖమ్మంలో టీఆర్ఎస్ పది స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. డిసెంబర్ 11న ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తా తెలుస్తుందన్నారు.
వ్యక్తులు శాశ్వతం కాదని రాష్ట్రం శాశ్వతమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. నాడు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందన్నారు. వందకు వంద శాతం మేనిఫెస్టోని అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఖమ్మంలో నామా నాగేశ్వరావు గెలిస్తే ప్రజలకు నామాలు పెడతారని పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే ప్రజలను పూవ్వుల్లో పెట్టి చూసుకుంటారన్నారు. తెలంగాణ రైతాంగానికి కోటి ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అవాకులు,ఛవాకులు పేల్చడం సరికాదన్నారు. సమైక్య పాలనలో కట్టిన ఇళ్లకంటే ఇప్పుడు కడుతున్న ఇళ్లు 7 రేట్లు ఎక్కువన్నారు. ఇళ్లు లేని పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే తమ అభిమతమన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రజల కోసమే యాగాన్ని చేపట్టానని తెలిపారు కేసీఆర్.సంక్షేమంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రపంచ దేశాల్లో లేని విధంగా టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కంటి వెలుగుతో పేదవారికి భరోసా ఇస్తున్నామని చెప్పారు.
సుమారు 411 పథకాలతో ప్రజాసంక్షేమంలో టాప్‌గా నిలిచామన్నారు. అంగన్‌వాడీలు,హోంగార్డులకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక హరిగోస పడితే నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
విపక్షాలకు డిపాజిట్ రాకుండా బుద్దిచెప్పాలన్నారు. ఏ కులం,ఏ మతం ఎవరికి అన్నం పెట్టదన్నారు. చెంప చెల్లు మనేలా ప్రతిపక్షాలకు బుద్దిచెప్పాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు డైనమిక్ మినిస్టర్ అని పది నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేశాడన్నారు. గత పాలకులు పాలేరుని ఎందుకు ఎండబెట్టారో చెప్పాలన్నారు. చంద్రబాబుతో ఖమ్మం జిల్లాకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
తలపున గోదారి పారుతున్న ఖమ్మంను ఎడారి చేసింది టీడీపీ,కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కావాలన్నారు. జిల్లాలో 160 కిమీల మేర గోదావరి పారుతుందని ఒక్కచుక్క నీటిని కూడా వృధా చేయవదన్నారు. పాలేరు బాటలోనే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలన్నారు. సీతారామ ప్రాజెక్టుతో జిల్లా పచ్చబడుతుందన్నారు. ఖమ్మంలో చంద్రబాబు అడుగుపెట్టాలంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుకుంటున్నాడో సమాధానం చెప్పి రావాలన్నారు. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచంలో మొదటిసారి రైతులకు ఎకరానికి 8 వేల పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరం నుంచి ఎకరాకు పదివేలు అందిస్తామని చెప్పారు. ఫించన్‌ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచుతున్నామని,నిరుద్యోగులకు రూ.3016,వికలాంగులకు రూ.3016 చెల్లిస్తామన్నారు. మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామన్నారు. ఐరాస రైతుబంధు పథకాన్ని గుర్తించి ప్రశంసించిందన్నారు. రైతు బంధు..రైతు ధీమా అన్నారు. రైతులు చనిపోతే రూ. 5 లక్షల ఇన్సురెన్స్ అందిస్తున్నామని చెప్పారు.