మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఓ వైపు సీపీఐ,టీజేఎస్ మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్లు ఆశీస్తున్న వారితో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న హస్తం పార్టీకి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వం మొదలైన సీట్ల కేటాయింపులు ఖరారు కాకపోవడం,మరోవైపు టికెట్లు ఆశీస్తున్న వారి నిరసనలతో గాంధీభవన్ ధర్నా చౌక్‌గా మారిపోయింది.
తొలి నుంచి పార్టీలో పనిచేసిన వారికే టికెట్ కేటాయించాలంటూ పలువురు నాయకుల మద్దతుదారులు గాంధీ భవన్ వద్ద తమ నిరసన తెలుపుతున్నారు. దీంతో గాంధీభవన్‌కు తాళం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు సమాచారం.
జనగామ సీటు టీజేఎస్‌కు కేటాయించడం ఆ పార్టీ నేత కొదండరాం పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా గుర్తింపుపొందిన పొన్నాల తన సీటుకే ఎసరు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లోని కీలకమంత్రి పొన్నాలతో మంతనాలు జరపగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పొన్నాల అనుచరులు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టీ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణలో బీసీలను అణగదొక్కాలని బీసీలు ఓటు వేయడానికి మాత్రమే రాజ్యాధికారానికి పనికిరారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు ఇలాంటి దొరల పాలన నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు ఒకటి కావాలని ఈ దొరల పాలన పై పోరాడాలని ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఓ వైపు పొత్తు,సీట్ల కేటాయింపుతో తలలు పట్టుకుంటున్న హస్తం నేతలు కీలకనేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్తతో అయోమయంలో పడినట్లు సమాచారం.