పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల అనుకూలతలో రాష్ట్రానికి మొదటి స్ధానం రావటమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..తెలంగాణలో 22 ప్రభుత్వ శాఖలు ఎంతో సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని…సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నవ తెలంగాణ పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టామన్నారు. టీఎస్ ఐపాస్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తుందని తెలిపారు. సింగిల్ విండో విధానం ప్రపంచంలో ఎక్కడాలేదన్నారు.పారిశ్రామిక రంగంపై 60 సమావేశాలు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పారీశ్రామీకరణ సరళతరం చేసేందుకు 26 చట్టాలను సరవించామని పేర్కొన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసిందని కితాబిచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్లో 22 సర్వీసులు మొదలుపెట్టామన్నారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. మొత్తం 380 అంశాలపై కేంద్రం సర్వే చేస్తే 324 అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు రావని గతంలో దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కేవలం రెండేళ్లలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని సాధించడాని అన్ని శాఖలు కృషి చేశాయని తెలిపారు. సంస్కరణల వల్ల లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు.ఫార్మా రంగంలో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు అభివృద్ధి సాధ్యమైందన్నారు.