వెలుగుల దీపావళి చీకట్లు నింపింది. టపాసులతో జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పించినా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో దీపావళి సంబరాల్లో భాగంగా టపాసులు పేలుస్తూ పలువురు గాయాల పాలయ్యారు. పటాకులు పేల్చిన వారే కాకుండా రోడ్లపై వెళుతున్న వారు కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూకట్టారు బాధితులు. దాదాపు 50 మందికిపైగా గాయాలవ్వగా 8 మంది కళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గాయాలపాలైన వారిలో చిన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచే కాకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. కొన్ని చోట్ల పటాకులు పేలడంతో షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
దీపావళి సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.