కర్ణాటక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి షాకిచ్చారు. ఉప ఎన్నికలు జరిగిన ఐదు స్ధానాల్లో నాలుగు స్ధానాల్లో గెలిచి సత్తా చాటింది జేడీఎస్-కాంగ్రెస్ కూటమి.ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించగా….. ప్రతిపక్ష బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట మాత్రమే ముందంజలో ఉంది.
బళ్లారి,మాండ్య లోక్ సభ స్ధానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు.మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ సమీప భాజపా అభ్యర్థి సిద్ధరామయ్యపై విజయం సాధించగా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంతపై కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప గెలుపొందారు.
ఇక రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు. మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్ విజయం సాధించారు. శివమొగ్గ లోక్ సభ స్ధానానికి కాంగ్రెస్-భాజపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.