శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. ఆర్.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా లోకేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అసలు దేశంలో ప్రజల సమస్యలకు కారణమైన నల్లధనానికి మూలమేంటి? ఓ సాధారణ హెడ్ కానిస్టేబుట్ కుటుంబం, నల్లధనం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది, ఎలా విచ్చిన్నమైంది. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడనేదే ఈ సినిమా కథ. మానవీయ విలువలుపై ఆర్ధిక విలువలు ఎలాంటి ఆధిపత్యాన్ని కనపరుస్తున్నాయి. రాజకీయాలను డబ్బు శాసిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుండి ప్రజలు రక్షించేదెలా అనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం“ అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ బ్లాక్ మనీ వల్ల దేశమెంతో వెనుకబడిపోతుంది. బ్లాక్ మనీ వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయనే దాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అలాగే బ్లాక్‌మనీ సమస్యను రూపుమాపి ఓ హెడ్ కానిస్టేబుల్ సమాజాన్ని ముందుకు ఎలా నడిపాడనేదే చూపిస్తున్నాం. 60 రోజుల పాటు సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 15లోపు చిత్రీకరణను పూర్తి చేసి జనవరిలో సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం“ అన్నారు.
చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ “మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆర్.నారాయణమూర్తి మా మనిషి. మా సంస్థలో జయసుధ చాలా సినిమాలు చేసింది. ఈ మధ్యనే మేం `బిచ్చగాడు` అనే సినిమా చేశాం. ఆసినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సక్సెస్‌తో మా బాధ్యత మరింత పెరిగింది“ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.
సునీల్ శర్మ, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, చలపతిరావు, వెన్నెల కిశోర్, వై.విజయ, సమీర్, విజయ భాస్కర్, విజయ్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.సుధాకర్ రెడ్డి, ఎడిటర్: మోహన రామారావు, నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, ఫైట్స్: సతీష్ మాస్టర్, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.