టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పల్లకి మోస్తున్నారని ఆరోపించారు . తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్,టీడీపీ నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..కాంగ్రెస్,టీడీపీ పార్టీలు దివాళకోరు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ రాదంటే కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొట్టారని … వలసవాదుల పాలన మాకొద్దని టీడీపీ పార్టీని ప్రజలు వాపస్ పంపిస్తే కాంగ్రెస్ ముసుగులో ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించరు. టీడీపీ అంటేనే ఆంధ్రా పార్టీ అన్నారు.
పాలమూరు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని…ఈ పథకం పూర్తయితే కొడంగల్ సస్యశ్యామలం అవుతుందని హరీష్ స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ కుట్రలు సాగనివ్వమని తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం,కృష్ణ నీటిని తరలించుకుపోవడానికి చంద్రబాబు కూటమి రూపంలో వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పొట్టచేత పట్టుకుని వలసలు పోయిన వారంతా టీఆర్ఎస్ పాలనలో వాపస్ వస్తున్నారని చెప్పారు.
అభివృద్ధిని అడ్డుకోవడం,కోర్టుల్లో కేసులు వేయడమే ప్రతిపక్షాల పనిగా మారిందన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు.