తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల గెలుపుపై పలు సర్వేలు నిర్వహించిన సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, జనసమీకరణ వంటి అంశాలపై అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఒక్క అభ్యర్థి తమ తమ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఓటర్‌ను కలిసే ప్రయత్నం చేయాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క వ్యక్తికి తెలపాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారుల వివరాలకు అందించామని, తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 60వేలకు పైగా ప్రజలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని, ఈ వివరాలన్నింటిని తమ అభ్యర్ధులకు అందించామని , తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మంచి జనాధరణ లభిస్తోందని, టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని, పార్టీ నిర్వహించిన అన్ని సర్వే రిపోర్టులు టీఆర్‌ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రచార సామాగ్రి ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ అభ్యర్థుల నూతనొత్తేజాన్ని నింపారు సీఎం కేసీఆర్.
కాగా సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభల పేరిట మూడు సభల్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తానని పార్టీ అభ్యర్థులకు తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజు నుంచే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధుల మొదటి విడత ప్రచారం కూడా పూర్తయిందనే చెప్పాలి.