పంజాబ్‌లో రైలు ప్రమాదం..60పైగా మృతి..

227
Amritsar train accident
- Advertisement -

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో హోవడా రైలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచుకున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రైలు పఠాన్‌కోట్‌ నుంచి అమృత్‌సర్‌ వెళ్తోంది.

train accident

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య వందకు పైగానే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్‌పై 500 మందికిపైగానే ప్రజలు నిల్చుని రావణ దహనాన్ని చూస్తున్నట్టు తెలుస్తోంది. దహనం సందర్భంగా భారీగా బాణసంచా పేల్చారు. ఈ శబ్దంలో రైలు వస్తున్న చప్పుడు వినిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ప్రమాదంలో పదుల సంఖ్యంలో గాయపడ్డారు.

కాగా, అధికార యంత్రాగం, దసరా కమిటీల నిర్వాకమే ప్రమాదానికి కారమమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రైలు వెళ్తున్నప్పుడు కనీసం అప్రమత్తం చేసి ఉంటే.. ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ముందే అప్రమత్తం చేసి ఉంటే రైలు వేగం తగ్గి నిదానంగా వచ్చేదని వారన్నారు. ఈ ప్రమాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సహాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -