ఉనికి కోసమే జైపాల్ పాకులాట:హరీష్‌

209
harish rao
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్..తెలంగాణ ఉద్యమాన్ని జైపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంలా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ఉనికి కోసమే జైపాల్ రెడ్డి పాకులాడుతున్నారని ఆరోపించారు.

జైపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుందన్నారు. దేశరాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న జైపాల్…ఆయన స్ధాయికి తగ్గ మాటలు మాట్లాడితే మంచిదన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్..పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు.జైపాల్ రెడ్డి పుట్టిపెరిగిన కల్వకుర్తికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీరొచ్చిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొబలైజేషన్ అడ్వాన్స్‌లను రద్దు చేశామని తెలిపారు హరీష్‌.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులే గుణపాఠం చెబుతారన్నారు. ఉనికి కోసం టీఆర్ఎస్ పార్టీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 15 వేల గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు,సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్‌దే అని స్పష్టం చేశారు.

- Advertisement -