కాంగ్రెస్‌కు చిరు గుడ్‌బై…!

234
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇప్పటికే ఆ పార్టీలో కొంతమంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ పనులకు దూరంగా ఉండగా తాజాగా మాజీ కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఏపీ ఇందిరా భవన్ వైపు కన్నెత్తి చూడని చిరు.. ఆ పార్టీ సభ్యత్వాన్ని కూడా పునరుద్దరించుకోలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారన్న వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ వార్తలకు బలం చేకూరుస్తు రాహుల్ ప్రతిపాదనను కూడా చిరు తిరస్కరించినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించాలని  రాహుల్ గాంధీ.. చిరంజీవిని కోరారు. అయితే ఇందుకు చిరు నుంచి ఎలాంటి సమాధానం లేదు.

2009లో రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్ధాపించారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొన్నేళ్లా తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నియమించబడి చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2014లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు రావడం,ఓటమి పాలవడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగి వెండితెరపై అడుగుపెట్టిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సురేందర్ దర్శకత్వంలో సైరా నరసింహరెడ్డి సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది వేసవిలో సినిమా  ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మెగాస్టార్. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారన్న వార్త రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే.. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో చిరంజీవిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఆశించినంత ప్రజలకు చేరువకాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అయినా.. ప్రజల ఆదరణ దక్కుతుందనుకున్న చిరుకు.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఎన్నిసార్లు ఎన్నికల ప్రచారం చేసిన అనుకున్నన్ని ఓట్లు రాబట్టలేకపోయారు. ఇక ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ పెట్టిన జనసేన పార్టీతో చిరు చేతులు కలుపుతారెమో చూడాలి. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కు అన్నయ్య మద్దతు ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -