బతుకమ్మ సంబురాలతో ప్రగతి భవన్ పులకరించిపోయింది. అటుకుల బతుకమ్మ సందర్బంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కవిత బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ భార్య శైలిమతోపాటు మహిళలంతా కలిసి బతుకమ్మలను పేర్చారు. ఒక్కేసి పువ్వేసి చందమామా అంటూ పాటలు పాడి ఉత్సాహంగా గడిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటి చెప్పే ఈ పండుగను చిన్నా, పెద్ద, యువతలనే తేడా లేకుండా వేడుకలు జరుపుకుంటున్నారు.
మరోవైపు రవీంద్రభారతిలో కూడా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చారిత్రక శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పిన కాకతీయ కళావైభవం కూచిపూడి నృత్యరూపకం అలనాటి చరిత్రక వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. వరంగల్ కు చెందిన నాట్య గురువు సుధీర్ రావు శిశ్యబృందం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యరూపకం పలువురిని ఆకట్టుకుంది. ఓరుగల్లు కోట, హరిదాసుపాట, గంగిరెద్దుల విన్యాసం, ఖుషీ మహాల్, జానపద నృత్యం ఆకర్షణగా నిలించింది. ఈ కార్యక్రమంలో ఇందిరా బైరి రచించిన తెలుగు గజల్స్ ను నృత్యరూపకం ప్రదర్శనకు ముందుగా గజల్ గాయని హిమజ రామమ్ ఆలపించారు. అనంతరం రవీంద్రభారతి ప్రాంగణంలో మహిళలంతా ఉయ్యాల పాటలు పాడుతూ సందడి చేశారు.