ఇండొనేషియాలో శుక్రవారం నాడు సంభవించిన 7.5 తీవ్రతతో కూడిన భూకంపం తరువాత ఏర్పడిన సునామీ, తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. 20 అడుగుల ఎత్తులో సునామీ అలలు తీరాన్ని తాకగా, పలు ప్రాంతాలు నీటమునిగాయి. సునామీ ధాటికి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 850కు చేరుకుంది. ఈ ఘటనలో 700మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సునామీ బీభత్సం సృష్టించిన పాలూ నగరంలో సుమారు 3 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ నగరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాకాసి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కొన్నిచోట్ల మృతదేహాలు నగర వీధుల్లో తేలియాడాయి. సునామీ బీభత్సంతో పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొంతమందికి ఆరుబయటే చికిత్స చేయాల్సి వస్తోంది. కొన్ని ఆసుపత్రులు కూడా కూలిపోవడంతో బయట టెంట్లు వేసి వైద్య సహాయం అందిస్తున్నారు.