అమ్మగా మారడానికి సిద్ధమే..ఇబ్బందులు తప్పవేమో!

206
- Advertisement -

ప్రస్తుతం బయోగ్రఫీ సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో తన మనసులో మాటను బయటపెట్టింది త్రిష. ఇటీవల ఓ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న త్రిష…తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని చెప్పింది.

అంతేగాదు తామిద్దరం ఒకే స్కూల్‌(చర్చ్‌ పార్క్‌)లో చదువుకున్నామని గుర్తుచేసింది. జయలలిత జీవితం స్పూర్తివంతంగా ఉంటుందని ఆమె చిత్రంలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని తెలిపింది. అయితే, ఇప్పుడు త్రిష చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి.

trisha-story

తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడి రాజకీయనాయకుల్లో అగ్రతాంబూలం సినిమా వాళ్లకే. అక్కడ అధికార, ప్రతిపక్షాలైన ఏడీఎంకే, డీఎంకే రెండూ సినిమావాళ్ల చేతిలో ఉన్నవే. అంతమాత్రం చేత సినీనటులు రాజకీయాలపై తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించడానికి లేదు. ఏదో ఒక పార్టీకి మద్ధతు పలికితే వేరే పార్టీ వాళ్లు వచ్చి దాడులకు పాల్పడుతూ ఉంటారు.

తాజాగా త్రిషకు అలాంటి చిక్కులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జయపార్టీ ఓడిపోయి ఏడీఎంకే అధికారంలోకి వస్తే త్రిషకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే గతంలో కూడా ఇలా ఏదో ఒక పార్టీ…నేతకు మద్దతు తెలిపిన సినీ నటులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

trisha-j-jayalalithaa

పంచెకట్టుకున్న తమిళుడు ప్రధాని కావాలని కమల్‌ చేసిన వ్యాఖ్య జయలలితకు కోపం తెప్పించింది. దాంతో కమల్‌కు ‘విశ్వరూపం’ చూపించింది. జయకు చెందిన చానెల్‌లో ఓ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఖుష్బూ.. కరుణానిధికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడింది. అంతే ఆ ప్రోగ్రామ్‌ నుంచి ఖుష్బూను తీసేశారు. దీంతో ఖుష్బూను డీఎంకే ఆదరించింది. అక్కడ స్టాలిన్‌కు అనుకూలంగా ఓ ప్రకటన చేయడంతో.. అళగిరి మనుషులు వచ్చి దాడి చేశారు. దీంతో కరుణానిధి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. స్టార్‌ హీరోలైన రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌ వంటి వారు కూడా కొన్నిసార్లు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. మరి త్రిష పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -