నేడు ఎల్‌బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు ప్రారంభం..

224
Hyderabad Metro Rail
- Advertisement -

ఈ రోజు మధ్యాహ్నం 12.15కు ఎల్‌బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త కారిడార్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కొత్త కారిడార్ ద్వారా 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం వాడకంలోకి రానుంది. అమీర్‌పేట-ఎల్బీనగర్ మధ్య ఉన్న 16 కిలోమీటర్ల కొత్త కారిడార్‌లో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

మెట్రో రైల్ మొదటి కారిడార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో 72 కిలోమీటర్ల లక్ష్యంలో 46 కిలోమీటర్లు పూర్తయింది. ఇది దేశంలోనే సేవలందిస్తున్న రెండో పొడవైన మెట్రో కావడం గొప్ప విషయం. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చెన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది. తాజాగా చెన్నైని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) వెనుకకు నెట్టివేసి రెండో స్థానానికి చేరుకుంది.

Hyderabad Metro Rail

ఇప్పటికే మెట్రో ప్రయాణం చేస్తున్నవారితో కలిపితే కొత్త మార్గంలో ప్రయాణించేవారి సంఖ్య లక్షన్నరకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులో లేదా ఇతర వాహనాల్లో సుమారు రెండు గంటలపాటు ప్రయాణం సాగే ఎల్బీనగర్- మియాపూర్ మార్గంలో మెట్రో వల్ల 52 నిమిషాల్లోనే గమ్యం చేరుకునే అవకాశం కలుగుతున్నది.

ఇప్పటికే ప్రారంభమైన మెట్రో మార్గం కంటే ఈ మార్గానికి ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్‌లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర గల అమీర్‌పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాళ కొత్త కారిడార్ ప్రారంభం కానున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మెట్రో రైలు విశిష్టత గురించి ట్వీట్ చేశారు.

- Advertisement -