నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్రలో కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయినా ఈ చిత్రంతో చైతూ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?అత్తపాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయిందా లేదా చూద్దాం.
కథ:
ఈగో ఫీలింగ్ ఉన్న బిజినెస్‌మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు చైతన్య(నాగ చైతన్య). లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లాగా చూడగానే అను(అను ఇమ్మాన్యుయేల్)ప్రేమలో పడతాడు. సీన్ కట్ చేస్తే కష్టపడి అనుని ప్రేమలో పడేస్తాడు. వీరిపెళ్లికి రావు ఒప్పుకుంటాడు. ఎంగేజ్ మెంట్ కూడా చేస్తాడు. కానీ వరంగల్ జిల్లాను శాసించే శైలజారెడ్డి(రమ్యకృష్ణ) తన కూతురు ఎంగేజ్ మెంట్ తనకు తెలియకుండా జరగడాన్ని జీర్ణించుకోలేదు. ఈ క్రమంలో శైలజారెడ్డిని ఒప్పించడానికి చైతూ పడిన కష్టాలు ఏంటీ..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నాగచైతన్య, రమ్యకృష్ణ నటన,సెకండాఫ్ కామెడీ. చక్కని భావోద్వేగాల్ని పండిస్తూ చైతూ అద్భుతంగా నటించాడు. చలకీ కుర్రాడిగా అత్త,భార్య మధ్య నలిగిపోయే భర్త పాత్రలో చక్కని వేరియేషన్ కనబర్చాడు. ఇక సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది అను ఇమ్మాన్యుయేల్. శైలజారెడ్డి పాత్రలో ఒదిగిపోయింది శివగామి రమ్యకృష్ణ. అత్త
పాత్రలో విశ్వరూపం చూపించింది. వెన్నెల కిశోర్, పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకే మేజర్ మైనస్ పాయింట్స్ రొటిన్ కథ,రొటీన్ టేకింగ్. రమ్యకృష్ణని శైలజారెడ్డి అనే ఓ శక్తివంతమైన పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ పాత్ర కథకి సరిగ్గా అతకలేదు. తల్లి, కూతురు మధ్య మితిమీరిన అహం ద్వితీయార్థంలో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. గోపిసుందర్ అందించిన సంగీతం బాగుంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ సూపర్బ్. దర్శకుడు మారుతి అందించిన కథ,ఆలోచన బాగున్నప్పటికి ఆసక్తిని రేకేత్తించేలా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. ఎడిగింట్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. తాజాగా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతూ శైలజా రెడ్డి గారి అల్లుడు అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. నటీనటులు,కామెడీ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ స్టోరీ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వినాయకచవితి సందర్భంగా అత్తా,అల్లుళ్లు కలిసి పంచిన వినోదమే శైలజారెడ్డి
గారి అల్లుడు.
విడుదల తేదీ:13/09/2018
రేటింగ్:2.75 /5
నటీనటులు : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : ఎస్ రాధకృష్ణ
దర్శకత్వం : మారుతి దాసరి