కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రాజెక్టులపై ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని ఆయన స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ పూర్తి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఆయన స్క్రిప్టు రైటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 38 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచిందని రాహుల్ గాంధీ తన స్క్రిప్టు రైటర్లు రాసిన స్క్రిప్టును చదివారని, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ప్రాణహిత – చేవేళ్ల తొలి జీవో 17 వేల కోట్లకు జారీ అయిన విషయాన్ని రాహుల్ గాంధీ, ఆయన స్క్రిప్టు రైటర్లు, కాంగ్రెస్ నేతలు మరిచిపోయారా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే కనీసం ప్రాజెక్టులు కట్టకముందే 2008 సంవత్సరంలో 38 వేల కోట్లకు, 2010లో 40వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేసిన సంగతిని కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఎందుకు పెంచారో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి సీడబ్ల్యూసి పై ఏమాత్రం అవగాహన లేదని, సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ను ఆమోదించి, కేవలం సంవత్సరం కాలంలోనే అన్ని అనుమతులను ఇచ్చిందని, ఇదంతా రాహుల్ గాంధీకి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు.