రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు భీమా పథకం నేటి నుంచే అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రాత్మక గోల్కొండ కోటలో త్రివర్ణా పతాకాన్ని ఎగరేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు. భారత జీవిత భీమా సంస్ధ ద్వారా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతుల తరుపున ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
రైతు మరణించిన 10 రోజుల్లోపే ఆయన కుటుంబానికి భీమాను అందించే విధంగా రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి ఏటా 25 వేల కోట్లను కేటాయిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తున్నామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఏడాదిలో మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.