భారతీయ సంస్కృతిలో జ్యోతిష్యం ఓ భాగమని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆధునిక కాలంలో కూడా జ్యోతిష్య శాస్త్రానికి నానాటికి ఆదరణ పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర జ్యోతిష్య మహాసభల కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి, విద్వత్సభ గౌరవ అధ్యక్షులు శ్రీ గాయత్రీతత్వానందఝషి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, దర్శనమ్ పత్రిక ఎడిటర్ మరుమాముల వేంకటరమణ శర్మ, విద్వత్సభ ప్రధాన కార్యదర్శి దివ్యాజ్ఞాన సిద్దాంతి, ఇతర జ్యోతిష్య పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో వున్న అనుభవజ్ఞులైన సిద్ధాంతులను, పంచాంగకర్తలను, జ్యోతిష్య పండితులందరు ఒకే వేదికపైకి రావడం గొప్ప విషయమన్నారు. నిత్య జీవితంలో పండుగులు-వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారమనీ, గత కొన్నేళ్లుగా పంచాంగాలలో పండుగలపై విభేదాలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహా సభల ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వరాష్ట్రంలో అని వర్గాల అభ్యున్నతికి మన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఎంతో కృషి చేస్తున్నారు.
అన్ని మాతాలను సమానంగా చూస్తున్న ఘనత దేశంలో ఒక్క కె.సి.ఆర్ కే దక్కుతుందని వెల్లడించారు. దేశంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు, ఎవ్వరూ చేయని అయుత మహా చండీ యాగం చేశారమన్నారు. పీఠాధిపతుల, స్వామీజీల సూచనల మేరకు తెలంగాణలో ప్రధాన దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, కొండగట్టు, భద్రాచలం తదితర క్షేత్రాల అభివృద్ధికి, జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించుటకు కూడా కృషి చేస్తురన్నారు.