తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, తెలంగాణ సాధనలో జర్నలిస్టులు ఎంతగానో పోరాడారని , జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. అందరిలాగే ఫోటో, వీడియో జర్నలిస్టులకు సమాన హక్కులకు కల్పిస్తాం. జర్నలిస్టు సంఘాలు ఉనికి కోసం ధర్నాలు చేయొద్దని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సందర్భం లేకుండా, డిమాండ్‌లో న్యాయం లేకుండా ధర్నాలు చేయడం సబబు కాదు. కొన్ని పత్రికలు ఇప్పటికీ తెలంగాణపై విషపు రాతలు రాస్తున్నాయి. మాకు పదవులు లెక్కకాదు.. అవసరమైతే పదవుల కోసం త్యాగం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ స్థిరపడి అభివృద్ధిలో ముందుకెళ్తున్నది. మనం అభివృద్ధిలో దేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నాం’ అని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం జర్నలిస్టులకు తీసుకున్న పథకాలను, స్కీములను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం ఫోటో జర్నలిస్టులకు మంత్రి బహుమతులను ప్రదానం చేశారు.