జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సిఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉండవల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈసందర్భంగా నిన్న రైతులతో జరిగిన చర్చలో చంద్రబాబు గురించి పలు కామెంట్లు చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు హామి ఇచ్చారని.. కానీ ఆ తర్వాత రెండు రోజులకే రెండు పేపర్లకు లీకులిచ్చి ఈవిషయాన్ని బయటకు తెలిసేలా చేశారన్నారు. అప్పుడే నాకు చంద్రబాబు, టీడీపీ పై నమ్మకం పోయిందన్నారు. ఆ తరువాతే తాను నరేంద్ర మోదీ ని కలిశానన్నారు.
తాను 2013లోనే చంద్రబాబును కలిసి పార్టీ పెడుతున్నానని చెప్పానని ఓట్లు చీలిపోతాయని ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెప్పారన్నారు. రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి తనను మోసం చేశారన్నారు. నేను ఎప్పుడు తనను రాజ్యసభ సీటు అడగలేదని ఆయనే ఆమాట అని మళ్లి మరిచిపోయారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు..టిడిపి అధికారంలోకి వచ్చాక తన తనయుడు లోకేష్ ఒక్కడికి మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఎప్పటికైనా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.