హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్, లెజెండరీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘గాడ్జిల్లా’ (2014) మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ క్రమంలోనే త్వరలో గాడ్జిల్లా సిరీస్లో మరో కొత్త సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ‘గాడ్జిల్లా – కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్’ పేరిట 2019, మే 31వ తేదీన మరో నూతన గాడ్జిల్లా సినిమా విడుదల కానుంది.
మైఖెల్ డోగర్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కైరా చాండ్లర్, వెరా ఫార్మిగా, మిల్లీ బాబీ బ్రౌన్, బ్రాడ్లీ విట్ఫోర్డ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకు చెందిన అఫిషియల్ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. శాన్డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్లో ట్రైలర్ను లాంచ్ చేశారు.
‘మన ప్రపంచం మారిపోయింది. భూమి అంతరించిపోతుందని మేం భయపడుతున్నాం. ఇప్పటికే అది ప్రారంభమైంది. దానికి మేమే కారణం.. మేమే ఆ ఇన్ఫెక్షన్..’ అనే మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. కాగా ట్రైలర్ విడుదలైన 12 గంటలలోపే 46 లక్షల మంది దాన్ని వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు గాడ్జిల్లా, మోత్రా కథాంశంతో వచ్చిన సినిమా తరహాలో ఈ కొత్త సినిమా ఉంటుందని తెలుస్తున్నది.