ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎస్పీ అధినేత ములాయం మండిపడ్డారు. పదవీ గర్వం తలకెక్కిందా..జూదగాళ్లను..మందుబాబులను ప్రోత్సాహిస్తున్నావా..ఎన్నికల్లో గెలిచే దమ్ముందా ? తానుండగా సమాజ్ వాదీ ముక్కలు కానివ్వనని ములాయం పేర్కొన్నారు. పార్టీలో సంక్షోభం నేపథ్యంలో ఎస్పీ కీలక సమావేశంలో మాట్లాడిన ములాయం..అఖిలేష్ తీరును తప్పుబట్టారు. ఆయన మద్దతుదారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో ఏం తెలుసని ప్రశ్నించారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని, అమర్ సింగ్..శివపాల్ పై తనకు గట్టినమ్మకం ఉందన్నారు. వారిపై ఎవరూ ఏం చెప్పినా వినిపించుకోదలుచుకోలేదని, తనను..శివపాల్ ను ఎవరూ విడదీయలేరన్నారు. జైలుకు వెళ్లకుండా తనను అమర్ సింగ్ కాపాడారని ములాయం పేర్కొన్నారు.
విమర్శలు ఎదుర్కొనే సత్తా లేని వారు నాయకుడిగా ఎదగలేరని అఖిలేష్‌కు సూచించారు. అమర్ సింగ్ నా తమ్ముడి లాంటి వాడు.. పార్టీలో,కుటుంబంలో విభేదాలు బాధకలిగించాయని వ్యాఖ్యానించారు. అమర్ సింగ్ తప్పులన్నింటిని క్షమించినట్లు స్పష్టం చేశారు.నేను బలహీనున్ని కాదన్న ములాయం…యువత నాతోని లేదని భావించవద్దని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని చూసి నేర్చుకోవాలని చురకలంటించారు. పేద కుటుంబం నుంచి వచ్చి…ప్రధానమంత్రిగా ఉన్న తల్లిని విడిచిపెట్టలేదన్నారు. ప్రధానిగా ఆయన అంకితభావం..పోరాటం చూసి నేర్చుకోవాలన్నారు.
పార్టీలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు ములాయం తమ్ముడు, అఖిలేష్ బాబాయ్ శివపాల్ యాదవ్. పార్టీ, సీఎం బాధ్యతలను ములాయం సింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. విమర్శలు, ఆరోపణలను తట్టుకునే ధైర్యం లీడర్ ఉండాలని కూడా అఖిలేష్ కు చురకలు అంటించారు.
మరోవైపు సొంతపార్టీ పెట్టే ప్రసక్తే లేదని సీఎం అఖిలేష్ స్పష్టం చేశారు. తండ్రి తనకు గురువు,మార్గదర్శని…ఆయన ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఆ పార్టీ నేత,ములాయం సన్నిహితుడు అమర్ సింగ్‌పై విమర్శల వర్షం కురిపించారు. అమర్ సింగ్ వల్లే ఎస్పీలో విభేదాలు మొదలయ్యాయని…పార్టీ పెడుతున్నానంటు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.