అటవీ భూములు ఆక్రమిస్తే..కఠినచర్యలు

227
dgp mahender reddy
- Advertisement -

అడవులు, వన్యప్రాణులు జాతీయ సంపద అని, వాటిని కాపాడుకుంటేనే మనుషులకు మనుగడ ఉంటుందన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ, వేట నియంత్రణపై పోలీస్, అటవీ శాఖల మధ్య సమన్వయ సమావేశం సచివాలయంలో జరిగింది. వివిధ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఫ్ఓలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంతో సహా, తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం ఇలాంటి సమావేశం జరగటం ఇదే తొలిసారి. అటవీ భూముల ఆక్రమణ, కలప కొట్టివేత, అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ కార్యక్రమాల నిరోధంలో సమావేశంలో విసృతంగా చర్చించారు. రెండు శాఖల మధ్య సమన్వయంపై పలు నిర్ణయాలు జరిగాయి. విభిన్న జాతులకు చెందిన చెట్లు, వన్యప్రాణులు నివసించే అటవీ భూమిని కాపాడటం, తద్వారా పర్యావరణ రక్షణ ప్రతీ పౌరుడి ప్రధమ విధి అని డీజీపీ అన్నారు.

వరంగల్ , అసిఫాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్లుగా అటవీ ప్రాంతం ఏ విధంగా ఆక్రమణకు గురైందన్న విషయాన్ని సమావేశంలో అటవీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో చూపారు. అటవీభూముల ఆక్రమణ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, పట్టా భూములు కాకుండా కొత్తగా ఆక్రమణలను కచ్చితంగా అడ్డుకోవాల్సిందేనని డీజీపీ ఆదేశించారు. పోలీస్ శాఖ తరపున అటవీ శాఖకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆక్రమణల దారులు, వేటగాళ్లపై పీ.డీ యాక్టు పెట్టి కేసులు పెడతామన్నారు. అడవి ప్రాధాన్యత, అది చేసే మేలుపై సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో అడవి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, జిల్లాల వారీగా మూడు శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. ఆక్రమణల తర్వాత కేసులు పెట్టడం కంటే, అసలు ఆక్రమణలు జరగకుండా చూడాలని, ఆక్రమణలకు గురైన అటవీ భూములను గూగుల్ మ్యాపులతో ప్రచారం చేయాలన్నారు. అటవీ భూముల ఆక్రమణలపై ప్రజలు, వివిధ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులకూ అవగాహన కల్పించాలని తెలిపారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఆక్రమణలు, స్మగ్లింగ్ కార్యకలాపాలను పసిగట్టేందుకు, వేట వ్యవహారాల గుర్తింపుకు ఉపయోగిస్తామని ప్రకటించారు. ఆక్రమణల్లో పాల్గొంటున్న కూలీలపై చర్యలు కాకుండా, నిజమైన నిందితులను గుర్తించాలి. అడవని ఆక్రమించి, దురుద్దేశ్యంతో అధికారులు, సిబ్బందిపై అట్రాసిటీ కేసులు పెడితే, విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు.

భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇచ్చేందుకు పచ్చదనం అవసరమని, పోలీస్ శాఖ, సిబ్బంది నాలుగో విడత హరితహారంలో పెద్ద ఎత్తున పాల్గొంటామని వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -