బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆ సామాజిక వర్గంలో పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషి జరిగినట్టే, బ్రాహ్మణ వర్గాలకూ జరుగుతుందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
ఈ రోజు ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం కేసీఆర్ బ్రాహ్మణ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో 10 నంచి 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామన్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
బ్రాహ్మణులు చేసే సేవ సమాజసేవ అన్నారు. బ్రాహ్మణుల కోసం పనిచేయడానికి బ్రాహ్మణ ట్రస్ట్ బాధ్యత వహిస్తుందని వెల్లడించారు. బ్రాహ్మణులతో తనకు, తన కుటుంబానికి దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. 1985లో ఎమ్మెల్యేగా ఉన్నపుడే దేశంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించినమన్నారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న బ్రాహ్మణ సదన్‌లో ఆచారం, సంప్రదాయం, పవిత్రత నెలకొనేవిధంగా చర్యలు తీసుకుంటమని తెలిపారు. దేశ వ్యాప్తంగా బ్రాహ్మణులు ఎవరు హైదరాబాద్ వచ్చినా వారికి అక్కడ వసతి కల్పిస్తామని.. అదే చోట బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ నిర్మిస్తమని వెల్లడించారు.
విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తామని తెలిపారు. దేవాలయాల కోసం కేటాయించిన భూములు, మాన్యాలు అన్యాక్రాంతం కాకుండా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. బ్రాహ్మణుల స్థితిగతులను తాను దగ్గరుండి చూశానని..బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనే తాను ఎదిగినానని సీఎం పేర్కొన్నారు. బ్రాహ్మణుల్లో పేదల సంక్షేమం కోసం బహుముఖ వ్యూహం అవలంబించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మాజీ డీజీపీ అరవిందరావు తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్రాహ్మణ ప్రముఖులు సీఎం కేసీఆర్ను అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డితోపాటు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.