ముంబైలో ఓ పాఠశాల విధించిన నిబంధనలు కలకలం రేపుతున్నాయి. విద్యార్ధినిల మనోభావాలు దెబ్బతినేవిధంగా సదరు విద్యాసంస్థ జారీ చేసిన నిబంధనలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి.
ఇంతకు ఆ విద్యాసంస్థ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని అనుకుంటున్నారా..? తమ పాఠశాలకు వచ్చే విద్యార్థినులు తప్పనిసరిగా లోదుస్తులు తెలుపురంగువే వేసుకుని రావాలని నిబంధన విధించింది. ఈ నిబంధనను విద్యార్థినిలకు అందించిన నూతన విద్యాసంవత్సర డైరీలో ఈ మార్గదర్శకాలను ప్రచురించింది. అయితే ఈ నిబంధనలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తమ పిల్లలను బలవంతంగా స్కూల్ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్కూల్ యాజమాన్యం నిబంధనలు మార్చాలంటూ వారు పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనను పాఠశాల యాజమాన్యం పట్టించుకోకుండా తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.