బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇప్పుడు దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఆయనను పెళ్లి చేసుకుంటామని అమ్మాయిలు ఎగబడుతున్నారట. ఆయన ఒప్పుకుంటే తాము పెళ్లాడేందుకు రెడీ అంటూ సందేశాలు పంపిస్తున్నారంట అమ్మాయిలు. ఇదేదో ఒకరో ఇద్దరో లేదంటే పదిమందో 100 మందో కాదు… ఏకంగా 44,000 మంది అమ్మాయిలు. వారంతా తమతమ వాట్సప్ ఖాతాల్లోంచి తమ బయోడేటాలతోపాటు తేజస్విని పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటూ సందేశాలను పంపారు. ఇప్పుడు ఇదే బీహార్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కడైనా రోడ్లు బాగోకపోతే ఫిర్యాదుచేయాలని తేజస్వి యాదవ్ వాట్సాప్ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే,ఇది ఆయన పర్సనల్ నెంబర్ అనుకున్న అమ్మాయిలు…ఫిర్యాదులకు బదులు ఆయన్ను పెళ్లి చేసుకుంటామంటూ మెస్సెజ్‌లు పెట్టారు.ప్రియ, అనుపమ, మనీష, కంచన్, దేవిక.. ఇలా మొత్తం 44 వేల మందికి పైగా అమ్మాయిలు ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోడానికి సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ నంబరుకు మొత్తం 47వేల మెసేజిలు వచ్చాయని, వాటిలో 44వేలు ఈ పెళ్లి ప్రతిపాదనలేనని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కేవలం 3వేల మెసేజిలు మాత్రమే రోడ్ల గురించి ఉన్నాయి.
తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలన్నింటినీ కూడా ఆ మెసేజిలలో ఇచ్చారు.ఇప్పటికి తాను ఇంకా బ్రహ్మచారిని కాబట్టి సరిపోయింది గానీ, పెళ్లి అయి ఉంటే తాను పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉండేవాడినని తేజస్వి సరదాగా అన్నారు. అయితే తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించే తేజస్వికి గతంలో ఒక విద్యార్థి తనకు రావల్సిన స్కాలర్‌షిప్ రావట్లేదంటూ ఫేస్‌బుక్‌లో ఫిర్యాదుచేయగా, ఆయన సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే ఇప్పించారు.